చంద్రపూర్ : పశువుల కాపరి సర్పంచిగా ఎన్నికైన ఘటన మంగళవారం మహారాష్ట్ర పరిధిలోని చంద్రాపూర్ జిల్లాలో చోటుచేసుకుంది. పాలకవర్గం గడువు ముగిసిన అయిదు పంచా యతీలకు ఈ నెల 18న ఎన్నికలు నిర్వహించగా మంగళవారం ఓట్ల లెక్కింపు జరిగింది. బల్లార్పూర్ తాలూకా పట్టణానికి ఆను కొని ఉన్న భామిని గ్రామ పంచాయతీలో 2308 మంది ఓటర్లు ఉండగా.

సర్పంచి పదవి కోసం ఆరుగురు పోటీపడ్డారు. అందులో పశువుల కాపరిగా జీవనం సాగిస్తున్న ప్రహ్లాద్ ఆలం సమీప ప్రత్యర్థి కమలాబాయి కొడా పేపై 233 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. కమలాబాయికి 852 ఓట్లు రాగా.. ప్రహ్లాద్కు 1085 ఓట్లు పడ్డాయి. ఎస్టీలకు రిజర్వ్ అయిన సర్పంచి పదవి కోసం ప్రధాన పార్టీలు కాంగ్రెస్, భాజపాలు తమ మద్దతుదారుల విజయం కోసం సర్వశక్తులూ ఒడ్డాయి. కనీసం నామినేషన్ ఫారం కూడా నింపడం రాని ప్రహ్లాద్ దానికి స్థానికంగా ఓ దుకాణదారుడి సాయం దరఖాస్తు నింపాడు. పోలింగ్కు కేవలం రెండురోజుల ముందు నిరాడంబరంగా ఇంటింటికి వెళ్లి ఓటు అభ్యర్థించడం గమనార్హం. బ్యానర్ కానీ, కరపత్రం పంచకుండా గెలుపొందడంతో స్థానికంగా చర్చనీయాంశమైంది. మిగతా వారు ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు తరలించడానికి వాహన సదుపాయం కల్పించినా తాను కుటంబ సభ్యులతో నడుచుకుంటూ వెళ్లి ఓటు హక్కు విని యోగించుకున్నాడు. 

భాజపా మద్దతుతో బరిలో నిలిచిన స్థానిక జడ్పీటీసీ సభ్యుడు హరీష్ గెడమ్ అర్థ, అంగబలం ఉపయోగించినా మూడోస్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ప్రహ్లాద్ నివాసం ఉండే ఏరియా ప్రజలు గంపగుత్తగా ఓటేయడంతో విజయం దక్కింది.